“నీ స్నేహితులెవరో  చెబితే నువ్వేంటో చెప్తా” ఈ ఒక్క మాట లోనే తెలుస్తుంది మంచి స్నేహితులను ఎన్నుకోవడం ఎంత ముఖ్యమో. మన చుట్టూ మంచి స్నేహితులు మంచి వాతావరణం ఉంటే మనం కూడా మంచి మార్గం వైపు అడుగు లేస్తాం. మన చుట్టూ చెడు స్నేహితులు చెడు వాతావరణం ఉంటే మనం కూడా చెడు మార్గం లో నడుస్తాం. ఇప్పుడు మనం మంచి స్నేహితులను ఎన్నుకోవడం ఎలా?... మన స్నేహం పదికాలాలపాటు నిలవాలంటే ఏ విధంగా నడుచుకోవాలి అన్నది ప్రాచీన భారతదేశపు గొప్ప రాజకీయ వ్యూహ రచనాశాలి, తాత్త్వికుడు అయిన చాణిక్యుడు చెప్పిన కొన్ని సూత్రాల గురించి తెలుసుకుందాం.

 1. మనిషి యొక్క స్వార్థమే స్నేహం చేయటానికి ప్రేరేపిస్తుంది. స్వార్థమే లేకపోతే తోటి వారితో స్నేహం చేయాల్సిన అవసరమే కనబడదు. ఇది చేదు నిజం.

2. తెలివితేటలు, మర్యాద, భయం, అపరాధ నా భావన, త్యాగ భావం వంటి లక్షణాలు ఉన్న స్నేహితులతో స్నేహం చేయడం వల్ల మనకి కూడా సమాజంలో గౌరవం ఉంటుంది.

3. ఎవరైతే మనల్ని ఎక్కువగా పొగుడుతారో.. వాళ్లతో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా నీకు అతనికి మధ్య విభేదం వచ్చినప్పుడు అతనికంటే నిన్ను ఎక్కువగా తిట్టే వారు ఎవ్వరు ఉండరు.

4. ఎవరైతే వేరే వాళ్ల రహస్యాలు మీ దగ్గర చెబుతారో వాళ్లని అస్సలు నమ్మకూడదు. ఎందుకంటే వాళ్లు మీ రహస్యాలు వేరే వాళ్ల దగ్గర చెప్పే అవకాశం ఉంది.

5. సంఘంలో మనతో సమ హోదా, సమాన స్థాయి కలిగిన వ్యక్తి తో స్నేహబంధం పెంచుకోవాలి. ఇద్దరూ సమఉజ్జీలు కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు భేదభావం తలకెక్కి స్నేహబంధం అర్ధాంతరంగా ముగిసిపోతుంది.

6. ఒక స్నేహితుని నిజాయితీని ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడే కనిపెట్టవచ్చు. ఎవరైతే సంతోషంలో మునిగి తేలుతుంటారో అతనిని అందరూ అంటిపెట్టుకొని వుంటారు. కాని నిజమైన స్నేహితుడు మాత్రం తన స్నేహితుడు కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు తనకు తోడుగా ఉంటాడు.

7. ఒక వ్యక్తి మన దగ్గర ఆప్యాయంగా మాట్లాడి, ఎదుటివారితో మన మీద చాడీలు చెబుతాడో అటువంటి స్నేహం చేయడం మన గొడ్డలితో మన వేళ్ళు నరుక్కున్నట్టే.

8. స్నేహితుల మధ్య నమ్మకం ఏర్పరుచుకోవాలి. బలహీనమైన మనసున్న వాడితో స్నేహం, బలమైన శత్రువు తో వైరం కన్నా ప్రమాదకరమైనది. బలహీనమైన మనసున్న వాడు, తన స్వభావ పూర్వకమైన పిరికితనంతో ఎన్నటికీ తన విశ్వాసం నిరూపించుకో లేడు.

9. పాము - ముంగిస, మేక - పులి మధ్య ప్రశాంతత గాని అనుబంధం గాని ఉండవు. అలాగే ఒక చెడు మనస్తత్వం కలిగినవాడు - మంచి మనస్తత్వం కలిగినవాడు మధ్య కూడా స్నేహం ఏర్పడదు. ఒకవేళ స్నేహం కుదిరిన అది పై మెరుగు మాత్రమే లేదా మోసం తో కూడుకున్నది.

may also like :-

how to increase brain power in telugu

how to start your day positively in telugu